హైదరాబాద్: రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవుకాని, మూసీ పునరుజ్జీవనానికి మాత్రమే డబ్బులు ఉన్నాయా అని రేవంత్ ను నిలదీశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటున్నదని విమర్శించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, లూటిఫికేషన్‌కే వ్యతిరేకమని చెప్పారు.
హైదరాబాద్ నాచారంలో ఎస్టీపీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ పునరుజ్జీవం చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చెప్పారు. పదేండ్లపాటు ప్రణాళికబద్దంగా ఒక్కో రంగాన్ని సరిదిద్దుకుంటూ వచ్చామన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చే తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చామని తెలిపారు.’హైదరాబాద్‌లో తాగునీరు, కరెంటు కష్టాలు లేకుండా చేశామన్నారు.
ఇంకా ఏమన్నారంటే – వర్షాలతో వరదలు పోటెత్తకుండా చర్యలు తీసుకున్నాం. కోట్ల రూపాయలతో సిటీలోని నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేశాం. మూసీ నీరు శుద్ధి కోసం ఎస్టీపీలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు దాదాపు 20 కోట్ల లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకున్నాం. వందశాతం మూసీ నీటి శుద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మురుగునీటి శుద్ధితో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సుమారు నాలుగు వేల కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేశాం.
బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీలతోనే మురుగునీరు శుద్ధి అవుతున్నది. ఎల్బీనగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించాం. మూసీపై 14 బ్రిడ్జిలు కట్టడానికి ప్రణాళిక రచించాం. మొత్తం రూ.20 వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళిక రచించాం. ఇప్పుడు రేవంత్ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారు.
ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ మాటున మూటలు వెనకేస్తున్నారు.కేసీఆర్ ఎప్పుడో మూసీ పునరుజ్జీవనం పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవు. ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు అంటున్నారు. మూసీ పునరుజ్జీవనానికి మాత్రమే ప్రభుత్వం వద్ద పైసలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవనానికి రూ.లక్షన్నర కోట్లు ఖర్చవుతాయని సీఎం రేవంత్ చెప్పారు.
మూసీ పునరుజ్జీవం ఎవరికోసం చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారానికి కాదా?. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటుంది. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం. పేదలకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు పోరాడుతాం. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముందుంటారని’ కేటీఆర్ చెప్పారు.