రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతిముర్ము.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అధ్యక్షుడు ముర్ము తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ట శీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ… పూరి జగన్నాథుడి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసంలో అందరూ శివుడిని కొలుస్తారు. అసత్యంపై సత్యం గెలిచిన పండుగ ఇది అని అన్నారు. అందరూ ఒక్కటై దీపాన్ని వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందన్నారు. దీపాలతో ప్రతీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని ఆమె అన్నారు.
కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు. ఈ రాత్రి రాజ్భవన్లో బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము… రేపు (శుక్రవారం) లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ జానపద కళారూపాల ఆవిష్కరణలో పాల్గొని శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వస్తారని రాష్ట్రపతి వర్గాలు వెల్లడించాయి.