Wednesday, September 18, 2024

TG | పబ్‌లు, స్పా సెంట‌ర్ల‌పై పోలీస్‌ అటాక్…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నగరంలోని పబ్‌లలో ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాగా జూబ్లీహిల్స్‌లోని పబ్స్‌ లో నిర్వహించిన తనిఖీల్లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 12 బృందాలు పాల్గొని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్‌లలో డ్రగ్స్‌ సేవించిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు అనుమానంతో స్పాట్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ చేశారు. పబ్‌లలో ఎవరైన డ్రగ్స్‌ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్‌ లైసెన్స్‌ రద్దు చేయడం జరుగుతుందని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని పబ్స్‌పై నిరంతరం నిఘా ఉంటుందని, పబ్‌లలో డ్రగ్స్‌ సంబంధిత నేరాలపై సమాచారం ఇవ్వాలంటే 8712659638 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.

డ్రగ్‌ ఫ్రీ హైదరాబాద్‌ డ్రైవ్‌ లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయని ఆయన తెలిపారు. కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని, పబ్‌ సిబ్బంది ఎవరైనా డ్రగ్‌ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని ఈ సందర్బంగా ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు.

స్పా సెంటర్లలో…

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో చందానగర్‌లో పలు స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి నలుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేపీహెచ్‌బీలోని సెలూన్‌ షాప్‌పై పోలీసులు దాడులు చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బట్టబయలలైంది. దీంతో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లలో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement