హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 5 తర్వాత రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానుందనిప్రభుత్వం పేర్కొంటోంది. తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్ల రిజల్ట్ వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేలా ప్రభుత్వం అన్ని నియామక సంస్థలకు దిశానిర్దేశం చేసింది.
563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
టీటీజీపీఎస్సీ కార్యాచరణ ముమ్మరం…
ఫ్రభుత్వ ఉద్యోగాల భర్తీ వేగంగా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కార్యచరణ సిద్ధం చేసింది. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలోని నియమకాలు పూర్తి కాగా, టీజీపీఎస్సీ పరిధిలోని పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టుకు సంబంధించిన తుది ఫలితాల వెల్లడి, ధ్రువ పత్రాలు పరిశీలన దశలో ఉన్నాయి.
పరిశీలన పూర్తి అయిన ఉద్యోగాల తుది ఫలితాలను అతిత్వరలో ప్రకటించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి అనంతరం రెండు మూడు నెలల్లోనే నియమకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. గ్రూప్ – 4లో 8 వేల 180 పోస్టులు ఉన్నాయి.
అయితే రాతపరీక్ష తర్వాత పోస్టుల ఆధారంగా జీఆర్ఎల్ కూడా విడుదల చేశారు. స్పోర్ట్స్ కేటగిరీలో సెలక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
మెరిట్ లిస్టు పూర్తయినవి…
ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పలు విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్ఎల్ను కమిషన్ విడుదల చేసింది.
1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి పరిశీలన ముగిసింది. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్ఎల్ విడుదలైంది. పురపాలక శాఖలో ఎకౌంటెంట్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. సాంకేతిక విద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది.
ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్య విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.
అన్ని నియామక బోర్డుల పరిధిలోనూ…
ఎన్నికల నియమావళి అయిపోగానే రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని శరవేగంగా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కార్యచరణ సిద్ధం చేసింది. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా, టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి.
ఈ నెలనుంచి మరింత వేగం…
ఈ నెలనుంచి నియామక ప్రక్రియలో సర్కార్ వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఇక వరుసగా వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తోంది.
ఈ క్రమంలో మరో 50వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతోంది. దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి. ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్ కీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్ధేశించుకుంది.
ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు18 వేలకు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది. 2023లో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్-1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పరీక్షలు మళ్లీ నిర్వహించినా సాంకేతిక కారణాలతో రిజల్ట్ వెల్లడించలేదు. పేపర్ల లీకేజీల వ్యవహారం తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. పారదర్శక పరీక్షలు, నియామకాల కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించింది.
కొత్తగా గ్రూప్-1 ప్రకటన జారీ చేయడం సహా కీలకమైన గ్రూప్-2, గ్రూప్-3తో పాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్ష తేదీలు ప్రకటించింది. ఇంటర్ విద్యావిభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబరులో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబరులో రాత పరీక్షలు పూర్తయ్యాయి. రానున్న పది రోజుల్లో కీ వెల్లడించాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.
రాతపరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావులేకుండా కమిషన్ చెక్ పెడుతోంది. గతంలో ప్రశ్నాపత్రం రూపొందించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని, సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు.
తద్వారా జాప్యంతో పాటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుండటంతో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే మళ్లీ పరిశీలించి తుది కీ వెలువరిస్తోంది.