హైదరాబాద్ అధికారుల సరికొత్త ఆలోచన
మల్టీ లెవల్ బిల్డింగ్స్‌లో పార్కింగ్ సమస్య
స్టిల్ట్‌లను నిర్మించేందుకు సన్నాహాలు
ఓకే చెప్పిన టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌మెంట్
వ్యాపార సముదాయాల్లో మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు
చట్టంలో సవరణలు చేస్తేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం
మేథోమథనం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
మల్టీ లెవల్ బిల్డింగ్స్‌లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పాటు, వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాల సమయంలోనూ సెల్లార్లలో నిలిచిన నీటిని మోటార్లతో తోడాల్సి వస్తోంది. చాలా లోతు తవ్వకాలతో వచ్చే మట్టితోనూ సమస్యగా ఉంది. ఇళ్ల నిర్మాణ ఖర్చు పెరుగుదలకు కూడా సెల్లార్లూ కారణమవుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో ప్రస్తుతం అయిదారు సెల్లార్ల వరకు అనుమతిస్తున్నారు. ఇక.. హైదరాబాద్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాల (సెసిమిక్ జోన్స్)ను కూడా సర్కార్ గతంలోనే గుర్తించింది.
పార్కింగ్ కోసం సరికొత్త యత్నాలు..
కాగా, సెసిమిక్ జోన్స్ పరిధిలో సెల్లార్ల నిర్మాణాలు చాలా ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సెల్లార్లనే అనుమతించకపోతే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్ధత తీసుకొచ్చి, పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవనాల్లో పార్కింగ్‌కు సెల్లార్ల స్థానంలో స్టిల్ట్‌లను (భూమి నుంచే పార్కింగ్ కోసం నిర్మాణం చేపట్టడం) చేపట్టాలని అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం డిజైన్‌లో సవరణలు చేస్తున్నట్టు సమాచారం. ఎన్ని అంతస్తులైనా స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులివ్వొచ్చనే భావన అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొలిక్కి రానున్న సమస్య..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టిల్ట్ తరహా నిర్మాణాలను అనుమతించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. రెండు నుంచి మూడు స్టిల్టుల వరకు అనుమతిస్తున్నారని, ఇళ్ల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే.. వాణిజ్య భవనాల నిర్మాణదారులు వీటిపై ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ స్థానంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతామన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చట్టంలో సవరణలు చేస్తేనే దీని అమలు సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన ఈ మేధోమథనం త్వరలో కొలిక్కి వస్తుందని సమాచారం.