మూసీ రివర్ ఫ్రంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూసీపై శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపారు.
ఈరోజు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ టెండర్ రూ.141 కోట్లు అయితే లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని స్పష్టం చేశారు.
కాగా, ఈ మీడియా సమావేశంపై కేటీఆర్ స్పందించారు. మూసీకి సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని వెల్లడించారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి… మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.