Sunday, July 7, 2024

TG కెకె రాజీనామాను స్వాగ‌తించిన కెటిఆర్ – ఎమ్మెల్యేల సంగ‌తేంటి అని ప్ర‌శ్న‌

తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే బీఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేల సంగతి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్నారు. కేకే రాజీనామా చేయడం స్వాగతించదగ్గదేనని… మరి ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నిలబెడదామని రాహుల్ గాంధీ చెబుతున్నారని… కానీ ఇలా రాజ్యాంగాన్ని నిలబెడతారా? అని నిలదీశారు.

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు అవకాశం లేకుండా పదో షెడ్యూల్‌ను సవరిస్తామని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మీరు దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఈ దేశం మిమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది? అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్లుగా ఇది ‘న్యాయ పత్రం’ ఎలా అవుతుందో చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement