Tuesday, December 10, 2024

TG – రేవంత్ పాల‌న‌లో అంబేద్క‌ర్ కు త‌ప్ప‌ని నిర్భంధం – కెటిఆర్

హైదరాబాద్‌: తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి, అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. . కాంగ్రెస్‌ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదని, అంబేద్కర్‌నని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశామ‌ని, . సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు.

ఈ రేవంత్ ప్ర‌భుత్వ క‌నీసం అంబేద్కర్ దండ వేసేందుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దళితబంధు తొలగించి అంబేద్కర్‌ అభయహస్తం తెస్తామన్నారని, ఇప్పటి వరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు.

దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. వందల మంది పోలీసులను పెట్టి తమను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్‌ శిఖరాలు ఎక్కిస్తే.. మీరు పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా మీరు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతార‌ని, అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టని విమర్శించారు. రాహుల్‌ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. మీ సీఎంకు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్‌ గాంధీకి సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదని, కావాలని అడుక్కుంటే రాదని ఎద్దేవా చేశారు. కనీసం నెల రోజులు సమావేశాలు జరగాలన్నారు. సచివాలయంలో రేవంత్‌ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్‌ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్‌ ప్లేట్లు మారాలా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారని చెప్పారు. నాలుగేండ్ల తర్వాత ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలో.. ఎక్కడ రాజీవ్‌ గాంధీ విగ్రహం ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇందుకు ప్ర‌జ‌లే త‌గిన విధంగా బుద్ది చెపుతార‌ని కెటిఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement