కూల్చివేతలను ఎలా ఆడ్డుకున్నారు
చిన్నారి పుస్తకాలు తెచ్చుకుంటానన్న ఆగలేదు
చెప్పులు దుకాణం తాక వద్దన్న వినలేదు
72 గంటల క్రితం కొన్న ఇల్లు మటాష్ చేశారు
మీకు మాత్రం నెల గడువు.. ఆ పై స్టే
హౌ… సమాధానం చెప్పండి నిలదీసిన కెటిఆర్
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ సోదరుడి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పాలన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో మాత్రం నోరు మెదపలేదని విమర్శించారు.
ఎల్‌కేజీ చదివే చిన్నారికి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని, వారం ముందు గృహప్రవేశం చేసిన ఇల్లు.. అన్ని కాగితాలున్నా పేక మేడలా కూల్చివేశారన్నారు. కానీ మీకు మాత్రం ఏకంగా 30 రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. ఈలోగా మీరు కోర్టులో స్టే సంపాదించుకున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు!
LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!
50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!
72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!
వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!
తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!
వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!
మీ సోదరుది బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మెడికల్ అడ్మిషన్ లు ఎప్పుడు సారూ..
గత పదేండ్లు పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అస్థవస్థంగా మార్చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తున్నదని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు, కాంగ్రెస్ సర్కారు వైద్యవిద్య ప్రవేశాలు చేసేదెప్పుడని నిలదీశారు. డెడ్‌లైన్ సమీపిస్తున్నా ఈ డైలమాకు తెరదించేదెప్పుడన్నారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీఓతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అనవసర జీఓ తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే మళ్లీ సుప్రీం తలుపు తట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పుచెప్పి నాలుగు రోజులు గడుస్తున్నా వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం కాకపోతే మరేంటని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా.. తెలంగాణలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
అక్టోబర్ 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే.. విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం దుర్మార్గమని, క్షమించరాని నేరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు.