వ్యవసాయ రంగంలో రోబోటిక్స్ సేవలు
అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు
సాంకేతికతను ఉపయోగించుకునేలా ప్లాన్
అందుబాటులో రావడం సంతోషంగా ఉందన్న కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
ఉద్యమ సారథి, మాజీ సీఎం కేసీఆర్ దర్శనికతకు ఇదే నిదర్శనం.. వ్యవసాయ రంగంలో రోబోటిక్స్ సేవలను వినియోగించుకునేలా ఎన్నో చర్చలు చేపట్టారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు అగ్రి హబ్‌కు సంబంధించిన పలు విషయాలను ట్విట్టర్ ద్వారా బుధవరం షేర్ చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు 2021లో కేసీఆర్ ప్రభుత్వం అగ్రి హబ్‌ను ఏర్పాటు చేసింది. ఏ సదుద్దేశంతో నెలకొల్పామో దాన్ని అగ్రి హబ్ విజయవంతంగా నెరవేరుస్తున్నందుకు, అన్నదాతలకు అండగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేసీఆర్ ముందస్తు ప్రణాళికలతోనే..
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్లౌడ్, డ్రోన్ల, వంటి అధునాతన సాంకేతికలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు 2021 ఆగస్టులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అగ్రి హబ్‌ను స్థాపించిందని కేటీఆర్ అన్నారు. ఇది దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువ చేసేందుకు వరంగల్, జగిత్యాల, వికారాబాద్‌లో అగ్రి హబ్ ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
అగ్రికల్చర్‌లో రోబోటిక్ సేవలు..
అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్‌ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.