Saturday, November 23, 2024

TG – రేవంత్ రెడ్డి క‌క్ష‌… త‌ప్పు చేయ‌ని నరేందర్ రెడ్డికి శిక్ష‌ : కేటీఆర్

త‌ప్పు చేయ‌కుండానే జైళ్ల‌ల్లో మ‌గ్గుతున్న రైతులు
సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా?
దుర్మార్గులు… నియంతుల పాల‌న అంటే ఇదే!
పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ప‌ట్నంతో కేటీఆర్ ములాఖ‌త్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు కొడంగ‌ల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం నరేందర్ రెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ‌నివారం చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో పరామర్శించామని చెప్పారు. నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నార‌ని, వారికోసం పోరాటం చేయండని చెబుతూ నరేందర్ రెడ్డి కోరార‌ని కేటీఆర్ చెప్పారు.

తప్పు చేయ‌కుండానే జైలులో మ‌గ్గుతున్న అమాయ‌కులు
తప్పు చేయ‌కుండానే ముప్ప‌యి మంది రైతులు జైలులో మ‌గ్గుతున్నార‌ని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులే ఉన్నార‌న్నారు. కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నార‌న్నారు. కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం పనిచేశార‌ని, కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశార‌ని, ఆ క్షోభతో ఆయన ఆత్మహత్య చేసుకున్నార‌ని కేటీఆర్ వివ‌రించారు.

- Advertisement -

నియంత‌లు.. దుర్మార్గుల పాల‌న‌లోనే…
నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటామ‌ని కేటీఆర్ అన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నామ‌ని, ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? అని ప్ర‌శ్నించారు. సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే ఆయ‌న‌ సామ్రాజ్యమా, ఆయ‌న‌ చక్రవర్తి? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చారా? అంటూ నిల‌దీశారు. సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే ఆయ‌న‌ ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరద‌ని, మీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయార‌ని, మీ ప‌రిస్థితి అంతే అని అన్నారు. మీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయార‌న్నారు.

పాపాలు పండే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది…
అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశార‌ని కేటీఆర్ అన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నార‌ని ఆరోపించారు. సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంద‌న్నారు.

న‌రేంద‌ర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు…
త‌మ పార్టీ నేత నరేందర్ రెడ్డి చాలా ధ్యైర్యంగా ఉన్నార‌ని, పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరిన‌ట్లు కేటీఆర్ చెప్పారు. మహబూబాబాద్ లో తాము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ త‌మ‌కు ఉత్సాహానిచ్చార‌న్నారు. మీ వెనుక కేసీఆర్ ఉన్నార‌ని, తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంద‌ని చెప్పారు. జైలులో ఉన్న‌వారు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని, రేవంత్ రెడ్డి మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీపై ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement