కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ఇందుకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లెక్కలే నిదర్శనమని చెప్పారు.
పేదరిక నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్న నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2020-21తో పోలిస్తే 2023-24లో 74 స్కోర్‌తో తెలంగాణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ముందుందని చెప్పారు. అంతకముంది 2020-21తో పోలిస్తే, ఇది ఐదు పాయింట్లు మెరుగైందన్నారు.
అనేక రంగాల్లో తెలంగాణ సాధించిన స్కోర్లు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమన్నారు. తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడంలో తెలంగాణ 100/100 మార్కులు సాధించిందని… స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో 90/100 స్కోరు సాధించిందని తెలిపారు. అభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో 84/100 సాధించడం సంతోషంగా ఉందన్నారు.