ఒకే రోజు నలుగురు అన్నదాతలు బలవన్మరణం
ఇప్పటి వరకు తెలంగాణలో రాలిన మట్టిపూలు 406
ఇవన్ని ప్రభుత్వం చేసిన హత్యలే
రైతుల మనోవేదనలే మీకు మరణ శాసనం రాస్తాయి
కన్నీళ్లే కపట సర్కార్ ను కూలదొస్తాయ్..
ట్విట్టర్ వేదికగా కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్ , ఆంధ్రప్రభ – తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అంటూ ఘాటు విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు రాలిన మట్టిపూలు 406
మరోవైపు రైతుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ పార్టీ సైతం స్పందించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ట్విట్టర్ వేదికగా. ;రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది. రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య.
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు.
వేసిన పంటలు చేతికిరాక.. వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక.. బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పాలన కాదు.. రాక్షస పాలన అంటూ బిఆర్ఎస్ ధ్వజమెత్తింది.