కెసిఆర్ ను కెటిఆర్ ఏదో చేశారు
అందుకే గులాబీ బాస్ కనిపించడం లేదు
దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం
మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ వెల్లడి..
హైదరాబాద్ – బీఆర్‌ఎస్ నేతలు, మంత్రి కొండా సురేఖల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ తాజాగా మరిన్ని కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ..’సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నాపై కేటీఆర్ పిచ్చి రాతలు రాయిస్తున్నారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్.
పదవీ కాంక్షతో కేసీఆర్‌ని కేటీఆర్ ఏదో చేశారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ కనిపించారు. అప్పటి నుంచి మళ్లీ కేసీఆర్ కనిపించలేదు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్‌లో కేసీఆర్ కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. గజ్వేల్‌లో పోటీ చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఓటర్లు చెప్పుకుంటున్నారు. అధికారం కోల్పోయే సరికి కేటీఆర్‌కు మతిభ్రమించింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. హైడ్రా, మూసీ అంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. మూసీ ప్రక్షాళనకు తెరలేపింది బీఆర్‌ఎస్ పార్టీనే. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను.
ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపితే ఊపేక్షించేది లేదు. రేవంత్ నాయకత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే, పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని.. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్ నేతలు పనిచేశారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.