ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మాణం సహా మొత్తం 8 ప్రధాన డిమాండ్లతో విద్యార్థి వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన జూడాలు.. సోమవారం నుంచి ఓపీ, ఎలక్టివ్ సర్జరీలను సైతం బహిష్కరించి సమ్మెబాట పట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణం కాగా.. డీఎంఈతో చేసిన చర్చలు సైతం విఫలం కావటంతో సమ్మె ఉద్ధృతం చేశారు.అయితే మంగళవారం రాత్రి మరోసారి డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూడాల చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పలు హామీల అమలుకు ప్రభుత్వం వాగ్దానం చేయడంతో సమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల నిర్మాణం, వసతి భవనాలకు నిధుల విడుదల, కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు ఇవాళ రెండు జీవోలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు.