Friday, November 22, 2024

TG | న్యాయం కోసం పోలీసులే రోడ్డెక్కడం బాధాకరం : సబిత ఇంద్రారెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి వైఖరే కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డుపైకి రావడానికి కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబితా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… తమకు న్యాయం చేయాలంటూ పోలీసులే రోడ్డు ఎక్కడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రోడ్డెక్కడం చరిత్రలో తొలిసారి అని.. ప్రజారాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి ? అని ప్రశ్నించారు.

యూనిఫాం ధరించి దర్నాలు చేయాల్సిన పరిస్థితికి తెలంగాణ వచ్చిందని.. తెలంగాణలో హోంమంత్రి లేకపోవడంతో కానిస్టేబుళ్లు త‌మ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడం బాధాకరమన్నారు.

ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 18 రోజుల్లో 4 రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. పిల్లలు కూడా తమ తండ్రులను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో పోలీసు కుటుంబాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలపై హింస సర్వసాధారణమైందన్నారు. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement