Monday, November 25, 2024

TG | ఇకపై సింగరేణిలో పాలన పరుగులు పెట్టాలి : ఎండీ ఎన్.బలరామ్

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో పరిపాలన పరుగులు పెట్టాలని, కోడ్ నేపథ్యంలో నిలిచిన‌ సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేయాలని సంస్థ‌ చైర్మన్, ఎండీ ఎన్.బలరాం ఆదేశించారు.

సంస్థ ద్వారా చేపట్టే ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని, ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి 25 మందికి పైగా శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు ఉత్పత్తి, రవాణాపై మాత్రమే నెలవారీ సమీక్షలు నిర్వహించేవారని.. ఇక నుంచి రక్షణ, సంక్షేమ శాఖతోపాటు మిగతా అన్ని శాఖల పనితీరుపై నెలవారీ సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా శాఖలకు అప్పగించిన పనుల పురోగతిని నెలవారీగా తెలుసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ప్రయివేటు రంగానికి పోటీగా మన సామర్థ్యాలను, ఆలోచనా విధానాలను మార్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలున్నాయని.. అధికారులు, ఉద్యోగులందరూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా, సమయానుకూలంగా నిర్వహించగలిగితే సంస్థను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టవచ్చన్నారు. పని గంటల వినియోగంతో పాటు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ లక్ష్యసాధనలో నిర్లక్ష్యం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతినెలా ఆయా శాఖల పనితీరులో మెరుగుదల కనిపించకపోయినా.. అప్పగించిన పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అదే సమయంలో సంస్థ పట్ల అంకితభావంతో పనిచేసిన వారికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా యాజమాన్యం ఉత్పత్తితో పాటు సంక్షేమం, రక్షణ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఖర్చులో రాజీపడకుండా రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేశారు. కంపెనీ అభివృద్ధికి మంచి సూచనలను స్వీకరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రక్షణ, సంక్షేమం, వైద్యం, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎక్స్‌ప్లోరేషన్, ఎస్టేట్స్, విజిలెన్స్ తదితర 32 శాఖల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్‌ ఆపరేషన్‌ అండ్‌ పర్సనల్‌ ఎన్‌వికె శ్రీనివాస్‌, ఇఅండ్‌ ఎం డైరెక్టర్ డి.సత్యనారాయణరావు, జిఎం(కోఆర్డినేషన్‌) జి.దేవేందర్‌, కార్పొరేట్‌లోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement