బాధితులకు అండగా ఉంటాం..
మూసి పరివాహక ప్రాంత ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ
కూల్చివేతల బాధితులతో హారీశ్ సమావేశం
కన్నీటీతో తమ గోడును వెలిబుచ్చిన నిర్వాశితులు
తమ కష్టార్జితాన్ని కూలగోడుతున్నారంటూ మూసీ ప్రజల ఆవేదన
అఖిలపక్షం సమావేశానికి డిమాండ్
విధివిధానాలు ఖరారు చేసేకే ముందుకు వెళ్లాలని సూచన
బాధితుల కోసం పార్టీ కార్యాలయంలో లీగల్ టీమ్ ఏర్పాటు
ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని వెల్లడి
హైదరాబాద్: హైడ్రా రాష్ట్రంలో హైడ్రోజన్ బాంబులా మారిందని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు . తాజాగా. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూల్చేస్తే ఎలా అని మండిపడ్డారు. కూకట్పల్లి పరిధిలో బలవన్మరణానికి పాల్పడిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో హరీశ్ రావు సమావేశమయ్యారు. హైడ్రా కూల్చివేతల బాధితులతో ఆయన మాట్లాడారు. వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో బాధితులు కన్నీళ్లతో తమ గోడును వెళ్లబోసుకున్నారు..
నలబై ఏళ్లుగా మూసీ ప్రాంతంలో ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకుని కట్టిన ఇళ్లను తమ కళ్లముందే కూల్చేవేస్తామని ప్రభుత్వం నోటీస్ లు జారీ చేసిందని గోల్లుమన్నారు . ఇన్నేళ్లలో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈ ప్రభుత్వం పేదల ఉసురు తీసేందుకు సిద్దమైందంటూ బోరున విలపించారు.. ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ జోక్యం చేసుకుని తమను కాపాడాలని హరీశ్ ను వేడుకున్నారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల ఇండ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందన్నారు. అఖిలపక్షాలతో మాట్లాడిన తర్వాతే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై సర్కార్ ముందుకు వెళ్లాలని హరీశ్‌రావు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ తాము ప్రజలను ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నదిలో పేదల రక్తం, కన్నీళ్లను పారిస్తోందని ఫైర్ అయ్యారు. ఒక్కొక్క పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే పేదలు ఎక్కడి పోవాలని ప్రశ్నించారు. . సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పనుల కారణంగా విశ్వనగరం హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా వందరోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన అంశంపై దృష్టిపెడితే బాగుటుందన్నారు.
ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలు రోగాలబారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ ఖ్యాతిని సీఎం రేవంత్ దెబ్బ తీస్తున్నారని చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే మూసీపై ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
కూకటపల్లిలో హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెండ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలకొట్టే సరికి గుండె పోటుతో చనిపోయిందన్నారు. ఇవ్వన్నీ రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్లే జరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడని, మరి తెలంగాణలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. నేడు తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్నారు. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తరువాత బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ఇక్కడ ప్రచారం చేయాలన్నారు.
హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయన్నారు. ఎప్పుడైనా రావచ్చని, తాము మీ వెంటే ఉంటామని భరోసానిచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామని చెప్పారు. లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందని చెప్పారు.
హైడ్రా బాధితులకు న్యాయపరంగా మద్దతుగా ఉండడానికి హరీష్ రావు ఆధ్వర్యంలో లీగల్ సెల్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
బాధితులు అవసరమైతే ఈ కింది నంబర్లకు ఫోన్ చేయాలంటూ సూచించారు.. న్యాయపరమైన ఖర్చులు అన్ని కూడా పార్టీ భరిస్తుందని హరీశ్ రావు వెల్లడించారు. బాధితులు ఒక్కరూపాయి కూడా పెట్టె అవసరం లేదన్నారు. ఈ లీగల్ సెల్ బృందం 24 గంటలు బాధితులకు తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటుంది.
న్యాయవాదుల వివరాలు
కల్యాణ్ రావు 8125535604
లలిత 9247817735
వేణుగోపాల్ 9985507660
బిఆర్ఎస్ లీగల్ సెల్ నెంబర్ 8143726666