- ప్రతీ సోమవారం ఫిర్యాదుల స్వీకరణ
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ఈ గ్రీవెన్స్ సెల్ ఎల్లుండి (జనవరి 6) నుంచి ప్రారంభం కానుండగా… ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన విరామంతో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది.
ప్రజలు తమ ఫిర్యాదులతో పాటు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఫిర్యాదుతో పాటు పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. హైడ్రా గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులపై ఏమైనా సందేహాలు ఉంటే 040 – 29565758, 040-29560596 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ !
అలాగే వారం రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది.
ఇక, గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది.