హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నిందితుల నుంచి 15.13 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు పబ్బుల్లో రిమిక్స్ డీజే డిస్కోజాకి నిర్వహించే వ్యక్తులు డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారని ముందస్తుగా సమాచారం అందింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈఎస్ నవీన్‌కుమార్ తన సిబ్బందితో బంజరాహిల్స్‌లో దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో అఖిల్ డీజే నిర్వాహకుడిని పట్టుకొని 2.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అఖిల్ ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహింపట్నంలోని సన్నీ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆతడి వద్ద 12.48 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి.
నిందితులు ఒక గ్రాము ఎండీఎంఏను రూ.5000 వేలకు అమ్మకాలు జరుపుతున్నారని, ఈ డ్రగ్స్‌ను బెంగుళూర్‌కు చెందిన అలెక్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. బెంగళూరు నుంచి అలెక్స్ హైదరాబాద్‌కు తరలిస్తుండగా అఖిల్,సన్నీలు నగరంలోని పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నాని అధికారులు తెలిపారు. కాగా నిందితుల వద్ద డ్రగ్స్‌తోపాటు 326 గ్రాముల గంజాయి కూడా లభ్యమైందని పోలీసులు తెలిపారు.