తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిన్న(ఆదివారం) సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నిన్న మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొట్టగా.. ఆ తర్వాత సాయంత్రం వరకు వాతావరణం మారిపోయింది. వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇక రాష్ట్రంలోని నాగర్కర్నూల్, గద్వాల్, నల్లగొండలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పాటుగా రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణను తాకుతాయి నైరుతి రుతుపవనాలు. కానీ.. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే వచ్చేశాయి.
ఈ నేపథ్యంలో రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముందుగానే పంటలు వేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక మంగళవారం నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.