Tuesday, November 12, 2024

TG | ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ప్రారంభించాలి : డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న 20 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన విద్యాశాఖ, ఆర్ అండ్ బీ, ప్రైవేట్ నిర్మాణ సంస్థ తదితరులతో సమీకృత పాఠశాలలు, లేఅవుట్, నిర్మాణ డిజైన్లు, వసతులు, బడ్జెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మొదటి దశలో ప్రారంభిస్తున్న 20 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటికే నిర్మాణ సంస్థకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పలు సూచనలు చేశారు.

కాగా, గతంలో చేసిన సూచనలు ఏ మేరకు అమలు చేశారంటూ ఫ్రీ కాస్ట్ నిర్మాణ సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఇప్పటి వరకు వచ్చిన స్థలాల వివరాలను డిప్యూటీ సీఎం విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణాలకు సంబంధించిన వివరాలు వచ్చాయని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వివరించారు.

అన్ని నిర్మాణాలు పూర్తయ్యే వరకు ప్రతి వారం సమీక్ష సమావేశం

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రతి వారం సమీక్షా సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో క్రీడలకు అనువైన స్థలం, పార్కులు తదితర వాటి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులకు ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌, ఇతర సిబ్బందికి డబుల్‌ బెడ్‌రూమ్‌, ఉన్నత విద్యాశాఖాధికారులు పర్యటించే క్రమంలో సౌకర్యవంతమైన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

- Advertisement -

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం వేగవంతం చేసేందుకు కమిటీ సభ్యులను విభజించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా క్రీడాపోటీలు నిర్వహించాలని, విద్యార్థులకు క్రీడా పోటీలు, ఇతర ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ల నిర్మాణంలో వేగం పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ భవనాలకు అవసరమైన స్థలం, నిర్మాణ వ్యయంపైన సమీక్షించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించాలని, వాటిని స్థానిక కళాశాల విద్యార్థులు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, మహాత్మా జ్యోతిబాపూలే కార్యదర్శి సైదులు, ఎస్టీ, ఎస్సీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ కార్యదర్శి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement