Tuesday, November 26, 2024

TG – నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

హైదరాబాద్‌: నేటి సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు..

స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చించే అవకాశమూ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లి ఏ విధంగా విజయం సాధించాలనే అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.గ్రామ, మండల, జిల్లాస్థాయి నూతన కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అవకాశాలు, ఎలాంటి అభ్యర్థులను బరిలోకి దించాలనే అంశాలపై చర్చించనున్నారు.

గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలను సమన్వయం చేయడం, ప్రభుత్వం ప్రజలకు అందించే లబ్ధిని పార్టీ నాయకుల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రచారం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశాలనూ పరిశీలించనున్నారు. నూతన కమిటీ ఏర్పాటు బాధ్యతలను స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ ఛైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను భారీ సంఖ్యలో గెలిపించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement