ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన https://cmrf.telangana.gov.in వెబ్‌సైట్‌ను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
ఇకపై సీఎం సహాయ నిధి దరఖాస్తులను వెబ్సైట్లోనే పూరించాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ నిధుల నిర్వహణ పారదర్శకంగా జరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.
ముందుగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 తర్వాత మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వద్దకు సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే వారి వివరాలతోపాటు సిఫార్సు లేఖను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆసుపత్రులకు పంపి నిర్ధారించుకుంటారు. వివరాలు అన్ని సరిగా ఉంటే అప్లికేషన్‌ను ఆమోదించి.. చెక్‌పై దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు.