Thursday, July 4, 2024

TG | ఇకపై ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు..

ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన https://cmrf.telangana.gov.in వెబ్‌సైట్‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు.

ఇకపై సీఎం సహాయ నిధి దరఖాస్తులను వెబ్‌సైట్‌లోనే పూరించాల్సి ఉంటుంది. సీఎంఆర్‌ఎఫ్ నిధుల నిర్వహణ పారదర్శకంగా జరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.

ముందుగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వద్దకు సీఎంఆర్‌ఎఫ్‌ కోసం వచ్చే వారి వివరాలతోపాటు సిఫార్సు లేఖను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆసుపత్రులకు పంపి నిర్ధారించుకుంటారు. వివరాలు అన్ని సరిగా ఉంటే అప్లికేషన్‌ను ఆమోదించి.. చెక్‌పై దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement