Friday, November 22, 2024

TG | 20న‌ ఢిల్లికి సీఎం రేవంత్‌…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లి వెళ్లనున్నారు. శనివారం హస్తినకు బయలుదేరి వెళ్తున్న సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవుతారు.

అసెంబ్లి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌ వేదికగా జరిగిన రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీ అమలుకు శ్రీకారం చుట్టిన అంశాన్ని సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పార్టీ అగ్రనేతలకు వివరించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోగానే అమలు చేస్తామన్న హామీనిచ్చామని కానీ జులై నెలలోనే ఈ హామీని అమలు చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచుకున్నామన్న అంశాన్ని వారు చెప్పనున్నారు.

వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్‌ సభను ఏర్పాటు చేసి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో రైతు రుణమాఫీ హామీనిచ్చామో అదే ప్రాంగణంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకోవాలని సీఎం రేవంత్‌ ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఢిల్లి పర్యటనలో ఈ విషయం చెప్పి వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు ఆయనను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఢిల్లి పర్యటనకు సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఎంపీలు వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల ముందు ఢిల్లి వెళ్లిన సీఎం రేవంత్‌ శనివారం నాటి హస్తిన పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement