షాద్ నగర్ ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల దగ్గర ఉన్న పరిశ్రమలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతిచెందగా… మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్ క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్యబృందాలు సంఘటనా స్థలంలో ఉండి అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి…
షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి షాక్‌కు గురయ్యానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ ప్రణాళికలపై క్షుణ్ణంగా సేఫ్టీ ఆడిట్, సమీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.