కరోనా కేసులు తగ్గకపోవడంతో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతున్నాయి. కరోనా విజృంభణ తరుణంలో ఒకదాని తరువాత మరొక పరీక్షలు వాయిదా పడుతునే ఉన్నాయి. తాజాగా టీజీ సెట్ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈనెల 30న జరగాల్సిన టీజీసెట్‌ను వాయిదా వేశారు. త్వరలో మళ్లీ నొటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
కరోనా కారణంగానే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో మే 30న ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడింది. గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్–2021 నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. టీజీసెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను WWW.TGCET.GOV.IN వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ప్రవేశాలకు సంబంధించి సందేహాల పరిష్కారానికి 040–23120431, 040–23120432 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, లాక్ డౌన్ నేపథ్యంలో టీజీ సెట్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.