సింగరేణి భవన్ : సింగరేణి పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ విద్యా బోధనను ప్రవేశపెట్టడానికి యాజమాన్యం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరాం ఆదేశించారు.
ఈ మేరకు రామగుండం-2 ఏరియాలోని యైటింక్‌లైన్ కాలనీలో ఉన్న సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ బోధనను ప్రవేశపెట్టేందుకు సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి దరఖాస్తు చేసింది. ఈ మేరకు చైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరాం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కాగా, కార్మికుల పిల్లలకు అత్యుత్తమ విద్య కోసం మొదట సెక్టార్-3 పాఠశాలలో సీబీఎస్ఈ బోధన ప్రారంభించాలని, అనంతరం శ్రీరాంపూర్ ఏరియాలోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సింగరేణిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలను ఆధునికీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కంప్యూటర్లు, ల్యాబ్ తదితర సౌకర్యాల కోసం అవసరమైన అనుమతులు జారీ చేశారు. ఈ మేరకు సింగరేణి విద్యా శాఖ పర్యవేక్షణలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. సింగరేణి పాఠశాల్లో సీఈఎస్ఈ బోధనకు చొరవ తీసుకున్న సంస్థ ఛైర్మన్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సెకండరీ విద్యా వ్యవస్థ నుండి CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వ్యవస్థ వరకు సింగరేణి పాఠశాలల్లో బోధన నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ నుండి సింగరేణి సంస్థ అనుమతి పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా పొందింది. ఈ లేఖను జతచేస్తూ, దరఖాస్తును గత వారం CBSE బోర్డుకు ఆన్‌లైన్‌లో సమర్పించారు. వచ్చే ఏడాది నుంచి తమ పాఠశాలలో సీబీఎస్‌ఈ బోధనకు అనుమతించాలని సింగరేణి సంస్థ కేంద్ర విద్యాశాఖను అభ్యర్థించింది.
ఇక త్వరలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి బృందం త్వరలో సింగరేణి పాఠశాలను సందర్శించనుంది. ఈ బృందం సింగరేణి పాఠశాలను సందర్శించి తరగతి గదులు, పాఠశాల క్రీడా మైదానం, లేబొరేటరీలు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించి తమ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనుంది.
మరో మూడు నెలల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడి సౌకర్యాలపై కేంద్ర విద్యాశాఖ సంతృప్తి చెందితే రామగుండం-2 ఏరియాలోని సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ బోధన ప్రారంభించేందుకు తొలుత అనుమతించే అవకాశం ఉంది. ఇదే పాఠశాలలో గతేడాది 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.