హైదరాబాద్, ఆంధ్రప్రభ:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో ₹450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్‌లో మూడో రోజు పర్యటిస్తోంది. అందులో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహా రాష్ట్ర బృందం సమావేశమైంది.
అనంతరం పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ హైదరాబాద్‌లో ₹450 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాంతో నగరంలో లక్ష చదరపు అడుగల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను క్యాపిటల్ ల్యాండ్ నిర్మించనుంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, బ్లూ-చిప్ కంపెనీల డిమాండ్కు అనుగుణంగా ఈ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ పార్కులైన ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్, ఎవ్యాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ వంటివి క్యాపిటల్ ల్యాండ్ నిర్మించినవే.
వ్యాపార వృద్ధిలో హైదరాబాద్ దూకుడు..
హైదరాబాద్లో ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చే విధంగా 25 మెగా వాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ రెండో దశ నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రారంభించి 2028కి పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తోంది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రగతి శీల విధానాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యాపార వృద్ధిలో హైదరాబాద్ దూసుకెళ్తోందని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు తెలిపారు. బిజినెస్ హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయి కానుందని వివరించారు.