వరంగల్, నల్లగొండ ,ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యతంతం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదంటూ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా ఓ అభ్యర్థికి మెజార్టీని ప్రకటించారని.. ఒక అభ్యర్థికి మేలు చేసే విధంగా కౌంటింగ్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కు తనకు లీడ్‌లో చాలా వ్యత్యాసం వస్తుందని, కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఏజెంట్ల సంతకాలు లేకుండానే ఫలితాలు ప్రకటిస్తున్నారని, ఇదేంటని అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌంటింగ్ హాళ్లలో ఫలితాలు తారు మారు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. హాల్-4లో మేము 539 ఓట్ల మెజారిటీ ఉన్నామని, కానీ అంతా గోల్ మాల్ చేశారని తెలిపారు. అందుకే కౌంటింగ్‌ను తాము బహిష్కరిస్తున్నామని రాకేష్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ జరిగిన తీరును త్వరలోనే ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. మూడో రౌడ్లు కలిపి 17 వేల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు.