Sunday, November 24, 2024

TG – జాబ్ క్యాలెండర్ కాదిది – డాబు కోసం పబ్లిసిటీ స్టంట్ : సతీశ్‌ రెడ్డి

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని.. డాబు కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌ రెడ్డి విమర్శించారు.

మైసూర్ పాక్‌లో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉన్నట్టుగానే కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌లో జాబులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేవలం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టామన్న పేరు కోసమే సర్కారు ఇదంతా చేసిందని అన్నారు.ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనే లెక్క చెప్పుకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని వై.సతీశ్‌ రెడ్డి అన్నారు. జాబ్ క్యాలెండర్ అంటే అందులో ప్రతి సమాచారం ఉండాలన్నారు. ఉద్యోగాల సంఖ్య, నోటిఫికేషన్ తేదీ, అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పుడు ముగుస్తాయి? పరీక్ష తేదీ వంటి అన్ని అంశాలు ఉండాలని.. కానీ అవేం లేకుండా ఏదో ఒక కాగితం పట్టుకొచ్చి దానికి జాబ్ క్యాలెండర్ అని పేరు పెట్టడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల మాదిరిగానే ఇది కూడా ఒక బోగస్ అని ఇవాళ్టితో స్పష్టమైందని వై.సతీశ్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందరిని మోసం చేస్తోందన్నారు. ఏ నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచిందో.. ఇప్పుడు వాళ్ల బతుకులనే ఆగం చేస్తోందని.. వాళ్లను రోడ్డు మీదకు నెట్టేసిందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నైజానికి నిదర్శనమని విమర్శించారు.

- Advertisement -

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను చెప్పి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బాజ్ క్యాలెండర్‌లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పకపోవడాన్ని బట్టి వారి వైఖరి స్పష్టమైందన్నారు. ఘోరమైన మోసం చేసిన కాంగ్రెస్ కు నిరుద్యోగులే గోరీ కడతారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement