Wednesday, July 3, 2024

TG – గోదావరి తీర ప్రాంతాలకు అలర్ట్..

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ గోదావరిపై మహారాష్ట్ర లో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. గోదావరి నదీ జలాల వాటా పై మహారాష్ట్ర – తెలంగాణతో గతంలో కుదిరిన ఒప్పందం మేరకు జూలై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తివేసి దిగువ తెలంగాణకు వదిలి పెట్టడం జరుగుతుందని ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఎటా జూలై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు త్రిసభ్య కమిటీ సమక్షంలో గేట్లు ఎత్తివేసి 0.2 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. కేంద్ర జల వనరుల సంఘం ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ ఇరిగేషన్ ఈఈ బాన్సడ్, ఎస్సారెస్పీ ఎస్ ఈ శ్రీనివాస్ గుప్తా, ఇంజనీరింగ్ అధికారులు చక్రపాణి, వంశీ గేట్లు ఎత్తివేసే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా జూలై 1 నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు తెరిచి ఉంటాయని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 120 రోజుల అనంతరం తిరిగి అక్టోబర్ 29న మహారాష్ట్ర రైతుల సాగు అవసరాల కోసం మూసి వేయడం జరుగుతుందని ఎస్ ఇ గుప్తా తెలిపారు.

అసలే వర్షాకాలం ఆపై పొరుగు మహారాష్ట్రలో 14 బాబ్లీ గేట్లు ఎత్తివేయడం వల్ల వరద ఉధృతి గోదావరిలో మరింత పెరిగే అవకాశం ఉంది. నాందేడ్ ధర్మాబాద్ మీదుగా బాసర గోదావరిలోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ఎస్సారెస్పీ, బాసర, నిర్మల్, ఖానాపూర్ దిగువ గోదావరి తీర ప్రాంతాలకు అధికారులు సోమవారం అప్రమత్తం చేశారు. రైతులు నది తీర ప్రాంతంలో ఉండవద్దని, చేపలు పట్టేవారు గోదావరి తీరానికి వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement