Sunday, September 22, 2024

TG | 100 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పాలిటెక్నిక్‌ కళాశాలలకు అనుబంధంగా రాష్ట్రంలోని వంద అసెంబ్లి నియోజకవర్గాల్లో పారిశ్రామిక శిక్షణా సంస్థలు (అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఐటీఐలను కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

పాలిటెక్నిక్‌, ఐటీఐలలో చదివిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు లభ్యమయ్యే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఈ శిక్షణను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో ఇప్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను కోరారు. కార్మిక, ఉపాధి కల్పనకు సంబంధించి శనివారం సచివాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ప్రస్తుతమున్న ఐటీఐ, పాలిటెక్నిక్‌ సిలబస్‌లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని , ఉన్న సిలబస్‌ను అప్‌ గ్రేడ్‌ చేయాలని ఆయన కోరారు.

సిలబస్‌ను మార్చేందుకు ప్రత్యేక కమిటీలను నియమించాలని, ఇందులో పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల ప్రముఖులను, నిపుణులను సభ్యులుగా నియమించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండకుండా వెనువెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభ్యమయ్యేలా కోర్సులను రూపొందించాలని కోరారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని, ఇప్పటి వరకు ఈ కేంద్రాలు లేని నియోజకవర్గాలను గుర్తించి అక్కడ వీటిని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వృత్తి నైపుణ్యం అందించే అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులను అత్యుత్తమంగా తయారు చేయవచ్చని, ఈ వర్సిటీల్లో నిపుణులైన అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు ఉంటారని, వారి ద్వారా శిక్షణ ఇవ్వవచ్చని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

స్కిల్‌ యూనివర్సిటీలో ఇప్పటికే స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లమా, ఐటీఐలు పూర్తి చేసిన విద్యార్థులు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో శిక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement