మన దేశం నుంచి వివిధ దేశాలకు ఫార్మా ఎగుమతులకు ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షలు చేయడం తప్పనిసరి చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) కేంద్రానికి నివేదించింది. మన దేశం నుంచి గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసిన మందులు వినియోగించిన వారిలో కొందరు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీడీఎస్‌సీఓ చేసిన సిఫార్సు పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దీని ప్రకారం ఇక నుంచి మన దేశం నుంచి ఎగుమతి చేసే మందలన్నింటినీ ముందుగా కేంద్ర ప్రభుత్వ సారధ్యంలోని లేబొరేటరీల్లో పరీక్షించాల్సి ఉంటుంది.
ఈ పరీక్షలు పూర్తయిన తరువాతే ఆ మందులను విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఎగుమతులు చేసే ఫార్మాకంపెనీలు ఆయా మందుల బ్యాచ్ శాంపిళ్లను ప్రభుత్వ ల్యాబ్స్‌లో పరీక్షకు ఇచ్చి తగిన ధృవపత్రం పొందాల్సి ఉంటుంది. ఇలా ధృవపత్రం పొందిన కంపెనీలు మాత్రమే ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతారు.
ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్‌తో పాటు, చండీఘడ్, కోల్‌కతా, చెన్నయ్, హైదరాబాద్, ముంబై, గౌహతిలోని సీడీఎస్‌సీజీ ల్యాబ్‌లతో పాటు, ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన టెస్టింగ్ ల్యాబ్స్‌లో శాంపిళ్లను పరీక్షిస్తారు. విదేశాలకు సరఫరా చేసిన మందుల విషయంలో అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం కావడంపై గత నెలలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఇలాంటి సంఘటన వల్ల మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని, దీనిపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.