ఇండియా మార్కెట్‌లోకి ప్రవేశించడంపై ప్రభుత్వంతో జరుగుతన్న చర్చల వియవంతమైన ఒప్పందం కుదిరితే టెస్లా మోడల్ వై కారును ముందుగా మన దేశ మార్కెట్లోకి తీసుకురానుంది. మోడల్ వై కారును జర్మనీతో పాటు, ఇండియా మార్కెట్‌లోనూ లాంచ్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారు జర్మనీలో 25 వేల యూరోల ధరగా నిర్ణయించారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో 22 లక్షల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారును కంపెనీ త్వరలోనే జర్మనీలో ముందుగా లాంచ్ చేయనుంది.
టెస్లాకు అమెరికా, చైనాతో పాటు, జర్మనీలోనూ కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మన దేశంలో ప్లాంట్ ప్రారంభమయ్యే వరకు టెస్లా జర్మనీ ప్లాంట్‌లో తయారైన కార్లనే భారత్ మార్కెట్లోకి దిగుమతి చేసుకోనుంది. మోడల్ వై క్రాస్‌ఓవర్ మోడల్ 3 సీడాన్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. అమెరికాలో ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ మోడల్ వై కారును 2020 నుంచి తయారు చేస్తోంది. అమెరికాలో ఈ మోడల్ కారులో మూడో వరస సీట్లను కూడా ఆఫర్ చేస్తోంది. 7గురు ప్యాసింజర్లు కూర్చునే విధంగా లభిస్తుంది.
మన దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు, విదేశాల నుంచి పూర్తిగా తయారైన విద్యుత్ కార్ల దిగుమతులకు ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో టెస్లాతో ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. టెస్లా మన దేశంలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఆటో కంపోనెంట్స్‌ను మన దేశం నుంచి కొనుగోలు చేయనుంది. మన దేశంలో ముందుగా అందుబాటులోకి వచ్చే టెస్లా కారు మోడల్ వై ఒక సారి ఛార్జింగ్ చేస్తే 330 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇందులో రెండు వేరియంట్స్ లభిస్తాయి. టెస్లా నుంచి వచ్చిన చౌక విద్యుత్ కార్లలో ఇది ఒకటి.