Saturday, November 23, 2024

డోన్‌బాస్‌లో భీకరయుద్ధం.. 40 పట్టణాలపై రష్యా ముప్పేట దాడి

కీవ్‌:తూర్పు ఉక్రెయిన్‌ పరిథిలోని డోన్‌బాస్‌ ప్రాంతంలో భీకరయుద్ధం కొనసాగుతోంది. అనేక పట్టణాలపై బుధవారం రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ఫిరంగులు, బాంబులు, క్షిపణులతో ముప్పేట దాడి చేశాయి. నదీతీర ప్రాంతమైన సీవీరొడోనెట్‌స్క్‌, లిసిచాన్‌స్క్‌, లుషాంక్‌, డోనెట్‌స్క్‌ సహా కనీసం 40 పట్టణాలపై విరుచుకుపడ్డ రష్యా దాదాపు 500 లక్ష్యాలను ధ్వంసం చేసింది. సీవీరోడోనెట్‌స్క్‌లో 11, లిసిచాన్‌స్క్‌ పట్టణంలో 8 ఆకాశహర్మ్యాలు సహా 50కి పైగాసాధారణ పౌరుల ఇళ్లు, విద్యాసంస్థలు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు. వందమందికిపైగా గాయాలయ్యాయి. భీకరదాడులను అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ ధ్రువీకరించాయి. లుషాంక్‌, డోన్‌బాస్‌ను గెలిస్తే తూర్పు ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలన్నీ రష్యా చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. ఆ లక్ష్యంతోనే క్రెవ్లిున్‌ వ్యూహాన్ని మార్చి కీవ్‌, ఖార్కీవ్‌నుంచి వెనక్కు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తోంది. కాగా భీకరయుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు పౌరులు తరలిపోతున్నారు. అయితే వారిని ఎటూ కదలనివ్వకుండా మార్గాలను రష్యా మూసేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. లిసిచాన్‌స్క్‌ సమీపంలోని ఉత్సినివ్కా గ్రామంపై రష్యా సేనలు ఫిరంగులతో దాడులు చేశాయని, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని లుషాంక్‌ గవర్నర్‌ సెర్‌హీయ్‌ హైడాయ్‌ పేర్కొన్నారు. సివిరోనోడోనెట్‌స్క్‌లో మానవతాసాయం అందిస్తున్న కేంద్రం ధ్వంసమైందని చెప్పారు. కాగా రష్యన్‌ సేనలు భీకరదాడులు చేస్తున్నప్పటికీ తమ సేనలు దీటుగా బదులిస్తున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. తమ సేనల దాడుల్లో రష్యాకు చెందిన 4 యుద్ధ ట్యాంకులు, నాలుగు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, 62మంది శత్రు సైనికులను హతమార్చామని పేర్కొంది. పది ప్రాంతాల్లో రష్యా సేలను తరిమికొట్టామని ప్రకటించింది. కాగా డోనెట్‌స్క్‌ ప్రాంతంలో దాడులను మరింత ముమ్మరం చేయాలని , సైనిక బలగాలను పెంచాలని అక్కడి రష్యా అనుకూల వేర్పాటువాదులు కోరుతున్నారు. తమ ప్రాంతాలకు మంచినీటి సరఫరాను ఉక్రెయిన్‌ నిలిపివేసిందని వారు ఆరోపించారు. కాగా ఉక్రెయిన్‌కు చెందిన 8వేలమంది సైనికులను బందీలుగా పట్టుకున్నామని, రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతోందని, వీరంతా యుద్ధనేరస్థులని రష్యా అనుకూల వేర్పాటువాద నాయకులు ప్రకటించారు. లుషాంక్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాలు ఉక్రెయిన్‌లోనే ఉన్నప్పటికీ ఇక్కడ రష్యా అనుకూల వేర్పాటువాద నాయకులు రొడియోన్‌ మిరోష్నిక్‌ మాత్రం ఆ ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా చెప్పుకుంటున్నారు.

కిసింజర్‌.. ఉచిత సలహాలొద్దు..

రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై హక్కును వదిలేసుకుని శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌ సిద్ధం కావాలన్న మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌ చేసిన సూచనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఉచిత సలహాలు మానుకోవాలని సూచించారు. రష్యాకు ఒక్క అంగుళం భూమిని కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. బహుశా.. కిసింజర్‌కు తెలిసి ఉండకపోవచ్చు. ఇది 1938 కాదు.. జర్మనీలా మాతృభూమిని రష్యాకు అప్పగించినట్టు చేయడానికి మేం సిద్ధంగా లేం. ఆయన క్యాలెండర్‌లో 2022 లేదు. అందుకే ఇలా మాట్లాడారు.. రోజులుమారాయని గుర్తించాలి అని అన్నారు. కాగా జెలెన్‌స్కీ బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో పాల్గొన్న ప్రతినిధులనుద్దేశించి గత రెండుమూడు రోజులుగా ప్రసంగించిన ఆయన బుధవారం లైబీరియా అధ్యక్షుడు జార్జ్‌ వీహ్‌తో సంప్రదింపులు జరిపారు. ఉక్రెయిన్‌లో నిnలిచిపోయిన నౌకలవల్ల ఆహార సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో పరిష్కారంపై వారిద్దరూ చర్చించారు. మరోవైపు రష్యా దాడుల్లో గాయపడిన తమ సైనికులకు వైద్యం చేయాలంటూ ఆస్ట్రియా చాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో చర్చించారు. రష్యా దాడి నేపథ్యంలో తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇన్నాళ్లూ రష్యన్లు వీసా లేకుండా ఉక్రెయిన్‌లో పర్యటించేందదుకు ఉన్న వెసులుబాటును రద్దు చేస్తూ జెలెన్‌స్కీ ఆదేశాలు జారీ చేశారు.

రష్యా యుద్ధనేరాలపై విచారణ..

దండయాత్ర సందర్భంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, బుచా, మరియపోల్‌ వంటి నగరాల్లో మానవహననానికి, యుద్ధనేరాలకు పాల్పడిన రష్యా సైనికులపై యుద్ధనేరాల విచారణ దిశగా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. బ్రిటన్‌, ఈయూ, అమెరికా కలసి ఈ అంశంపై చర్యలు ప్రారంభించాయి. కాగా రష్యాకు చెందిన మరో ఇద్దరు సైనికులను యుద్ధనేరగాళ్లన్న అభియోగంపై బుధవారం విచారణ మొదలైంది. ఖార్కీవ్‌ ప్రాంతంలోని బెల్‌గొరోడ్‌లో డెర్లాచీ విద్యాసంస్థను పేల్చివేయడం, పౌరులపై కాల్పులు జరపడం వంటి యుద్ధనేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అలెగ్జాండర్‌ బాబికిన్‌, అలెగ్జాండర్‌ ఇవనోవ్‌లను కొటెలెవెస్క్‌లోని ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement