శ్రీనగర్:జమ్మూకాశ్మీర్‌లోని స్థానికేతరులు, లోకల్ హిందూ మైనార్టీలే టార్గెట్‌గా ఉగ్రవాదులు జరుపుతున్న హత్యాకాండలో మరో వ్యక్తి అసువులు బాశారు. దీంతో, ఉగ్రవాదులు గత మూడు రోజుల్లో చేసిన టార్గెట్ కాల్పులకు ఇద్దరు బలయ్యారు. ఉగ్రవాదుల కాల్చివేతలో రాజస్థాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్ మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని అరెహ్ మోహనపుర బ్రాంచ్‌కు చెందిన ఎల్లాక్వి దేహతి బ్యాంక్‌లోకి గురువారం అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదులు, బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లోనే, కెమెరాల సాక్షిగా కాల్చి చంపారు. కాల్పుల కలకలతో బ్యాంక్ మేనేజర్ రక్తమోడుతూ ఉండగాన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే, విజయ్‌కుమార్ మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. తీవ్రవాదులు బ్యాంకులో ప్రవేశించడం, మేనేజర్ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం కెమెరాల్లో రికార్డయింది. విజయ్‌కుమార్ రాజస్థాన్ లోని హనుమాన్‌గర్హ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇటీవలే ఆయనకు రాజస్థాన్ నుంచి కుల్గామ్‌కు ట్రాన్స్‌ఫర్ కావడం జరిగింది. మిలిటెంట్స్ చేస్తున్న టార్గెట్ హత్యలకు రెండు రోజుల క్రితం ఒక దళిత ఉపాధ్యాయిని బలైంది. జమ్మూకి చెందిన రజిని బాల అనే హిందూ టీచర్‌ను తీవ్రవాదులు స్కూల్ బైట కాల్చివేశారు.
మేమే చేశామన్న కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూప్..
కుల్గామ్‌లో జరిగిన బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చి చంపింది తామేనని కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూపు ప్రకటించింది. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్యకు బాధ్యత వహిస్తూ లేఖను విడుదల చేసింది. కాశ్మీర్ భౌతిక స్వరూపం మార్చాలని ప్రయత్నించిన వారందరికీ ఇదే గతి పడుతుందని గ్రూపు హెచ్చరించింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో కాశ్మీర్‌లో వచ్చి స్థిరపడాలని ప్రయత్నిస్తే, ప్రాణం ఖరీదు చెల్లించాలనే వాస్తవం తెలుసుకోవాలని కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ లేఖలో హెచ్చరించారు. కాశ్మీర్‌లో జరుగుతున్న హత్యలు చూసిన తర్వాత అయినా, ఆలోచించాలని, లేనిపక్షంలో తర్వాత టార్గెట్ మీరేనని హెచ్చరించింది.
అజిత్ దోవల్‌తో హోంమంత్రి..
రాజస్థాన్‌కు చెందిన బ్యాంకుమేనేజర్ విజయ్‌కుమార్‌ను కాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయభద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్‌తో న్యూఢిల్లి లో సమావేశమయ్యారు. కాశ్మీరీల హత్యల నేపథ్యంలో ఈ ఇద్దరి భేటికి ప్రాముఖ్యత సంతరించుకుంది. కానీ, ఇది సాధారణంగా జరిగే భేటీనే అని కేంద్రవర్గాలు వెల్లడించాయి.జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతలు, భద్రతా చర్యలపై ఈనెల 3వ తేదీన, శుక్రవారం (నేడే) హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ జరగనుంది. గత పదిహేను రోజుల్లో ఈ మీటింగ్ జరగడం ఇది రెండోసారి. ఈ మీటింగ్‌లో ప్రతి ఏడాది నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు తీసుకోవాల్సిన భద్రతాచర్యలు, ఏర్పాట్లపై హోంమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి అమర్‌నాథ్ యాత్రకు భక్తులను అనుమతించలేదు. దీంతో ఈ ఏడాది యాత్రీకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశంలో, జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్, ఆర్మీచీఫ్, పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ జనరల్స్, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..