Tuesday, November 26, 2024

Russia: మాస్కోలో ఉగ్రదాడి…70మంది మృతి…

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడి జ‌రిగింది. ఉత్తర శివారు ప్రాంతం క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 70 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది.

- Advertisement -

ఈ భయానక ఉగ్రదాడిపై దర్యాప్తు మొదలైంది. ఉగ్రవాదులు ఎలాంటి అనుమానం రాకుండా భద్రతా బలగాల యూనిఫాం ధరించి కన్సర్ట్ హాలులోకి ప్రవేశించారని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. గ్రెనే‌డ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డారని వివరించింది. కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని తెలిపింది. ఇంటర్నేషనల్ మ్యూజిక్ బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు. మృతదేహాలను పరిశీలిస్తున్నామని, బాధితుల సంఖ్య పెరగవచ్చని పేర్కొన్నారు. రష్యా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే తీవ్రవాదులను మట్టుబెట్టారా? లేక అదుపులోకి తీసుకున్నారా? అనే దానిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటన విడుదల చేసింది. అనుబంధ గ్రూపు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. మాస్కోతో పాటు ఇతర నగరాల్లో ఇస్లామిస్ట్ గ్రూపులు దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. మరోవైపు ఈ దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన విడుదల చేశారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన కొద్ది రోజులకే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement