Saturday, November 23, 2024

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనికి సం బంధించిన ఏర్పాట్లను అధికారులు అన్ని పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష లకు హాజరుకాబోతున్నారు. ఇందులో 2,58,098 బాలురు, 2,51,177 మంది బాలికలు హాజరుకానున్నారు. ఈమేరకు 2,881 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా పేపర్‌ లీకులులాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 మంది స్పెషల్‌ ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లను అధికారులు నియమించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల కోసం మంచినీటి సౌకర్యం, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, వైద్య సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. విద్యార్థులను సకాలంలో చేరుకునేలా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపేలా చర్యలు తీసుకున్నారు. 2861 చీఫ్‌ సూపరింటెండెంట్‌, 2861 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను, 33,000 ఇన్విజిలేటర్లను నియమించారు. కోవిడ్‌ నిబంధనల నడుమ పరీక్షలను నిర్వహించాలని డీఈవోలను సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధం విధించారు. 33 జిల్లాలో పరీక్షలు జరుగుతుండటంతో అత్యధికంగా హైదరాబాద్‌లో 406 సెంటర్లు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లిలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా పరీక్ష సిలబస్‌ను ఈసారి 70 శాతానికే కుదించారు. 11 పరీక్షా పేపర్లకు బదులు ఆరు పేపర్లకు తగ్గించారు. అలాగే ప్రశ్నపత్రాల్లో అధికంగా ఛాయిస్‌ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వనున్నారు. ఏ సెంటర్‌లోనూ పేపర్‌ లీక్‌ కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: మంత్రి సబిత

పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబిత సూచించారు. భయాందోళనలకు, ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా రాయాలని ఈమేరకు మంత్రి శనివారం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement