Saturday, November 23, 2024

టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రశాంతంగా నిర్వ‌హించాలి : స‌బితా ఇంద్రారెడ్డి

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మే 6 నుంచి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు, మే 23 నుండి జూన్ 1 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపద్యంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కార్యదర్శి దేవసేనతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ… కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాలు పరీక్షలకు దూరంగా ఉన్న విద్యార్థులు రెండు సంవత్సరాల తర్వాత 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అలాగే మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈసారి ఎండలు అధికంగా ఉండే మే మాసంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఇంటి నుండి పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాసి మళ్ళీ ఇంటికి చేరేవరకు వారి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత అధికారులదేన‌ని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల చేరేలా ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడిపి వాటిలో సగం సీట్లను విద్యార్థుల కోసం రిజర్వ్ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు మూడు రోజుల్లోగా అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అవసరమైన విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర అవసరమైన మందులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏఎన్ఎం లేదా ఆశ వర్కర్ ను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూశాఖ వారు పరీక్ష జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలన్నారు. పోలీసులు గట్టి బందోబస్తుతో పరీక్ష ప్రశ్న పత్రాలను స్టోర్ చేసి ఎస్కార్ట్ సహాయంతో పరీక్ష కేంద్రాలకు తరలించాలని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోస్ట్ ఆఫీస్ వారు జవాబు పత్రాలను జాగ్రత్తగా తరలించాలన్నారు. రెండు సంవత్సరాల తర్వాత విద్యార్థులు పరీక్షలు రాయనున్నoదున పరీక్షలు రాయడానికి కొందరు విద్యార్థులు ఆందోళన గురవుతారని, ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు ఉచితంగా 9154951977, 9154951704, 9154951696, 9154951703, 9154951706, 9154951687 నెంబర్ల ద్వారా సైకాలజిస్ట్ లతో టెలి కౌన్సిలింగ్ ఇప్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని దీనిని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సూర్య ప్రకాష్, డిఎం ఆర్టీసీ కిషన్ రావు, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ డిఈ శ్రీనాథ్, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ మనోహర్, ఏఏంవిఐ సాంరిఛార్డ్ స‌న్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement