విజయనగరం : పదోతరగతి, ఇంటర్‌మీడియట్ పరీక్షల్లో గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. అందుకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని విద్యాశాఖల అధికారులను ఆదేశించారు. విద్య, అక్షరాశ్యతలపై తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఓలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలను జారీ చేశారు. పదోతరగతిలో బాగా చదివే విద్యార్థులు, మరింత మంచి గ్రేడ్ పాయింట్లు సాధించే విధంగా, వెనుకబడిన విద్యార్థులు కనీసం పాస్ మార్కులు సాధించే విధంగా వేర్వేరు ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి, పరీక్షలను ఎదుర్కొనేవిధంగా తయారు చేయాలన్నారు. ట్యూటర్ల ద్వారా ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా చూసిరాతలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ విధించాలని, విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులను ఏర్పాటు చేయాలని సూచించారు.
వేసవిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా చదువులు దెబ్బతిన్నాయని, కొందరికి కనీసం చదవడం రాయడం కూడా రావడం లేదని అన్నారు. అందువల్ల 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవిలో బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛందంగా చదువు చెప్పేందుకు ముందుకు వచ్చే వారిని, సచివాలయాల్లో విద్యా సహాయకులను, వలంటీర్లను, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఉపాధ్యాయులను, ట్యూటర్లను, విద్యాశాఖలో, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారిని ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పిఇటిల ఆధ్వర్యంలో క్రీడా శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ క్రీడలతోపాటు, యోగా, లేదా కర్రసాము, కత్తిసాము లాంటి సంప్రదాయ విద్యలను విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. అలాగే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు టైలరింగ్, డేటా ఎంట్రీ లాంటి వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల తరువాత విద్యార్థుల్లో ఇటు విద్యాపరంగా గానీ, అటు క్రీడల పరంగా గానీ గణనీయమైన మార్పు వచ్చేలా, ఈ సెలవులు ఉపయోగపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.