Sunday, November 24, 2024

భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు

కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉద్ధృతమవుతున్నాయి. నిజ్జర్ హ‌త్య‌లో భారత్ పాత్ర ఉండంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఆ వెంటనే ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించుకోవడం.. కెనడియన్లకు ఇచ్చే వీసాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడుతుండటంతో విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌ కెనడాల మధ్య విమాన ప్రయాణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక దీంతో ఒక్కసారిగా భారత్‌ కెనడాల మధ్య విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి.

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ పర్యటనల్లో మార్పులు చేసుకోవడంతో విమాన ప్రయాణాలు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌ కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతానికి పైగా పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చివరి నిమిషంలో భారీగా టికెట్‌ బుకింగ్స్‌ చేసుకున్నట్లు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement