Saturday, November 23, 2024

బాసర త్రిపుల్‌ ఐటీలో ఉద్రిక్తత, 12 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర త్రిపుల్‌ ఐటీ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. త్రిపుల్‌ ఐటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనబాట చేపట్టారు. ఉదయం నుంచే వందలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించారు. రెగ్యులర్‌ వీసీ లేకపోవడం.. ఉన్న ఇన్‌ఛార్జీ వీసీ కాలేజీకి రాకుండా హైదరాబాద్‌ నుంచే త్రిపుల్‌ ఐటీ వ్యవహారాలు చూడడం సమస్యలకు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సరిపడా స్టాఫ్‌ లేరని, హాస్టళ్లల్లో సౌకర్యాలు లేవని ఇలా 12 రకాల డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. సీఎం వచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఉదయం నుంచే మోహరించారు.
తెలంగాణలో ఏకైక త్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీ నిర్మల్‌ జిల్లాలోని బాసరలో ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ వర్సిటికీ రెగ్యులర్‌ వీసీని ప్రభుత్వం నియమించిందిలేదు. ఇన్‌ఛార్జీ వీసీలతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నెట్టుకొస్తున్నారు. షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేస్తున్న రాహుల్‌ బొజ్జానే ప్రస్తుతం త్రిపుల్‌ ఐటీకి ఇన్‌ఛార్జ్‌ వీసీగా ఉన్నారు. ఈయన ఇతర శాఖల బాధ్యతలు ఉండడంతో హైదరాబాద్‌ నుంచే వర్సిటీ పరిపాలన సాగిస్తున్నారు. తరచూ వర్సిటీకి రావడంలేదని, దాంతో తమ సమస్యలు పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్‌ వీసీని నియమిస్తే విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉంటారని, తమ సమస్యలను ఆయనకు విన్నవించుకోవడం ద్వారా అవి పరిష్కారమవుతాయని అంటున్నారు. రెగ్యులర్‌ వీసీ లేకపోవడంతోనే త్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. మెరుగైనా సౌకర్యాలు కల్పించి సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాల్సిన కాలేజీ నిత్యం ఏదోక సమస్యతో కొట్టుమిట్టాడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ల్యాప్‌ టాప్‌లు ఇవ్వకుండానే చదువులా?…

వర్సిటీలో మొత్తం 7500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి సంవత్సరం 1500 సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఏడాది విద్యార్థులకు అందజేయాల్సిన ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్స్‌ ఇంత వరకు ఇవ్వలేదని తెలుస్తోంది. విద్యార్థులకు ఇచ్చిన ల్యాప్‌ టాప్‌లను చదువు అయిపోయిన తర్వాత మళ్లిd తిరిగి తీసుకుంటారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి అసలు ల్యాప్‌ టాప్‌లను ఇవ్వడంలేదని, కాలం చెల్లిన ల్యాప్‌ టాప్‌లను ఇస్తున్నారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ సాంకేతిక విద్యా ఏమాత్రం అందడంలేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడి సిబ్బందిలో రెగ్యులర్‌ స్టాఫ్‌ ఉన్నది కేవలం 20 మందే అని తెలిసింది. గతంలో రూ.110 కోట్ల బడ్జెట్‌ వర్సిటీ పరిధిలో ఉండేదని, ఇప్పుడు సున్నా బడ్జెట్‌గా మిగిలిపోెయిందని అంటున్నారు.

తల్లిదండ్రుల ఆవేదన…

తమ పిల్లలు ఎండలో ఆందోళన చేపడుతుంటే అధికారులెవ్వరూ పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమని లోపలికి అనుమతించడంలేదన్నారు. తమ పిల్లలను చూసిపోదామని దూరం నుంచి వచ్చిన తమను పోలీసులు అనుమతించక పోవడం దారుణమన్నారు. తమ పిల్లలకు ఏమైనా అయితే పోలీసు శాఖదే బాధ్యత అని హైదరాబాద్‌, వనపర్తి నుంచి వచ్చిన తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.

- Advertisement -

విద్యార్థులకు మద్దతుగా…

యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట చేపట్టిన విద్యార్థులకు పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాల నుంచి మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో ఆయన వర్సిటీ గోడ దూకి లోపలికి వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడుతుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీస్‌ వాహనాన్ని ఎన్‌ఎస్‌యూఐ నేతలు అడ్డుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement