న్యూఢిల్లీ – పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హరియాణా, పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా నేడు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లను దాటుకొని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అలాగే వాటన్ క్యానన్ ఉపయోగించి వారు ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.
మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కనీస మద్దతు ధరపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మోడీ గ్యారంటీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.
ఉత్పత్తి ధరకంటే కనీసం 50శాతం అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్ చెప్పిందని చౌహాన్ సభకు వివరించారు. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్, జొన్న పంటలకు ఉత్పత్తి ధరకంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు.