Friday, November 22, 2024

పండుగ వేళ టెన్షన్​.. మళ్లీ జనాల్లో కరోనా కొత్త వేరియంట్​ భయం

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : దేశంలో తగ్గుతుందని అనుకుంటున్న కొవిడ్‌ మహమ్మారి మళ్లి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం కొవిడ్‌ వైరస్‌ అయిన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7. ఇది అత్యంత వేగంగా వ్యాప్తించే లక్షణం కలిగి ఉండటంతో పాటు చాలా ప్రమాదకరమైందని కూడా వాదన వినిపిస్తోంది. దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో ఈ వేరియంట్‌ వ్యాప్తి చెంది, కేసులు పెరగొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే దేశంలో ఇప్పటి వరకు వచ్చిన అనేక సబ్‌ వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్‌ ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌ కంటే పది రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్‌ ఎక్స్‌ వేరియంట్‌ ఇప్పుడు గుజరాత్‌లో వెలుగుచూసింది.

వడోదరకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్‌ను గుర్తించడం గమనార్హం. ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో ఎక్స్‌ ఈ వేరియంట్‌ కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్టు వార్తలు వచ్చాయి. అదే విధంగా మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కొవిడ్‌ కేసుల్లో 17.7 శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్‌ ఉపకరమైన ఎక్స్‌బీబీ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75 తో పోలిస్తే విస్త్రృత వేగంతో వ్యాప్తి చెందడంతో పాటు రోగనిరోధకతను తప్పించుకునేందుకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్లూ మాదిరి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని..వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే మహారాష్ట్ర అధికారులు అక్కడి ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మహానగరానికి ముప్పు.!

- Advertisement -

కొవిడ్‌ మహమ్మారి కేసులు నగరంలో తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వణికిస్తోంది. గతంలో మహానగరానికి చెందిన పలు శాఖల అధికారులు, వైద్యాధికారుల వైఫల్యం కారణంగా మహారాష్ట్ర నుంచే అధిక కేసులు హైదరాబాదుకు రావడంతో అప్పట్లో రెండు, మూడు వేవ్‌ల ప్రభావం హైదరాబాద్‌పై పడిన సంగతి తెలిసిందే. నగరం నుంచి మహారాష్ట్రకు అనేక మంది రైళ్లు, బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో గతంలో మహారాష్ట్ర సరిహద్దులను మూసిన వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపావళి రానున్న తరుణంలో ఇప్పటికే మొదటి, రెండు, మూడు దశల్లో ప్రజలను కష్టాలకు గురిచేసిన వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో మళ్లి ఎక్కడ వస్తుందోనన్న ఆందోళన నగరవాసుల్లో నెలకొంది. అయితే, కొత్త వేరియంట్‌ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement