న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు పిలవగానే తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందని, అందరూ వచ్చి ఢిల్లీలో మకాం వేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ… ఈడీ విచారణలో కవిత సహకరించలేదని తెలిసిందన్నారు.
ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నిస్తే… ఆమె ఏమో, తెలియదు, గుర్తు లేదని చెప్పిందట అని ఆయన తెలిపారు. ఈడీ విచారణకు సహకరించక పోతే త్వరగా అరెస్ట్ చేస్తారని అరవింద్ జోస్యం చేప్పారు. కవిత తప్పు చేసినందుకే బీఆర్‌ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారని విమర్శించారు. ఇలాగే అన్ని వ్యవహారాల్లో నాయకులు స్పందించాలని అన్నారు. మహిళలపై తెలంగాణలో క్రైం పెరిగి పోయిందని, కవిత మీద ఉన్న శ్రద్ధలో 10 శాతమైనా ప్రజల మీద పెట్టాలని ఆయన కోరారు.
తెలంగాణ క్యాబినెట్ మొత్తం ఢిల్లీ వచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు. దగాకోర్ల ఊబిలో మాగుంట కుటుంబం ఇరుక్కుందని, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు రాజకీయాల్లో అంటరాని వాళ్లని అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారికి అందరూ దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే వ్యాపారులకు అంత మంచిదని ఆయన హితవు పలికారు.