అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో అధిష్టానం తీసుకున్న సరికొత్త నిర్ణయం టెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు యూత్ ఫార్ములాను అమలు చేసే పనిలో ఉండటంతో సీనియర్ నేతలు ఎక్కడికక్కడ సర్దుకుంటూ, మళ్లి బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఇదే యూత్ ఫార్ములాను తీసుకువచ్చి కేవలం తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను చంద్రబాబు మళ్లి అమలు చేసే పనిలో పడ్డారు. ఆనాడు ఎన్టీఆర్ తర్వాత పార్టీలో యువతకు అంత ప్రాధాన్యత దక్కిన పరిస్థితి లేదని చెప్పవచ్చు.
అధికారం ఉన్నా, లేకున్నా సీనియర్ నేతలే పార్టీలో హవా సాగించారు. అయితే 2019 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. అప్పటివరకు అధికారాన్ని అనుభవించడంతో పాటు పార్టీలో అంతా తామే అన్న తరహాలో వ్యవహరించిన కొందరు సీనియర్ నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా దాదాపు ఇంటికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన పార్టీ అధినేత చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే సీనియర్లు యాక్టీవ్‌గా లేని పరిస్థితి ఉందో ఆయా నియోజకవర్గాల్లో యూత్ ఫార్ములాను అమలు చేశారు.
చాలా నియోజకవర్గాల్లో యువనాయకత్వాన్ని ప్రొత్సహిస్తూ వచ్చారు. అప్పటివరకు ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న చాలామంది జూనియర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయడంతో పాటు, వివిధ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను నియోజకవర్గాల్లో సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అలాగే వివిధ సందర్భాల్లో కేసులు, అరెస్టులకు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో మహానాడు విజయవంతంలో కూడా యువ నాయకత్వం పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చు. పార్టీ అగ్రనేత యువనాయకుడు లోకేష్‌తో అన్ని నియోజకవర్గాల నేతలు నిత్యం టచ్‌లో ఉంటూ మహానాడు విజయవంతానికి తమవంతు కృషి చేశారు.
ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలో యువ నాయకత్వాన్ని మరింత ప్రొత్సహిస్తామని 40 శాతం సీట్లు వారికే కేటాయిస్తామని స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అయితే అనేక నియోజకవర్గాల్లో యువ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొందరు సీనియర్లు మోకాలడ్డుతున్నట్లుగా పార్టీ వర్గాలలోనే ఆరోపణలు ఉన్నాయి. తాము చేయరు.. వేరొకరిని చేయనివరు అన్న విధంగా వ్యవహరిస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వం కొంత ఆవేదనలో ఉంది. వీటన్నింటికి అధిష్టానం చెక్ పట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు పార్లమెంటరీ, నియోజకవర్గ స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ యువ నాయకత్వం ద్వితీయ శ్రేణి నేతలకు అవసరమైన భరోసాను ఇస్తోంది. దీంతో యువ నాయకత్వం మరింత జోష్‌తో నియోజకవర్గాల్లో పనిచేస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
మూడేళ్లుగా ఇళ్లకే..
గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం అనంతరం అనేకమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. మూడేళ్లు గడిచినా.. ఇంటి గడప దాటలేదన్న విమర్శలు పార్టీలోనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు యువ నాయకత్వానికి ఇస్తున్న ప్రొత్సాహం, 40 శాతం టికెట్ల ఫార్ములా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు స్తబ్దంగా ఉన్న పార్టీ సీనియర్లు మళ్లి యాక్టీవ్ పాలిటిక్స్‌లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకమంది సీనియర్లు నియోజకవర్గాల్లో మళ్లి పర్యటనలు చేసేందుకు కేడర్‌తో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకమంది నేతలు పార్టీకి తామే ముఖ్యమన్న భావనలో ఉండటమే కాక తాము తప్ప వేరే గత్యంతరం లేదన్న అపోహతో ఉన్నారన్న అభిప్రాయం కూడా ద్వితీయ శ్రేణి పార్టీ నాయకత్వం నుంచి వినిపిస్తోంది.
అయితే అనేక నియోజకవర్గాల్లో సీనియర్లు యాక్టీవ్‌గా లేకపోవడంతో కొత్తవారికి ముఖ్యంగా యువతకు అధిష్టానం నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నుంచి ఇతర కీలక పదవులను ఇచ్చి కేడర్ జారిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దీంతో సీనియర్లు లేకున్నా యువ నాయకత్వం తమదైన శైలిలో నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో పడింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్‌లను కూడా అధిష్టానం మార్చింది. చంద్రబాబు 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్న ప్రకటనకు అనుగుణంగా దాదాపు 70 స్థానాల్లో యువతకే అవకాశం దక్కనున్నాయి. ఇవన్నీ గమనించిన సీనియర్ నేతలు మూడేళ్ల తర్వాత మళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం ఈ అంశంపై సీరియస్‌గానే దృష్టి పెట్టింది. ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో సైతం చంద్రబాబు కొంతమంది సీనియర్లకు చురకలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అధిష్టానం నుంచి మరో కొత్త సవాల్
సీనియర్ నేతలు మళ్లి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి కొత్త చిక్కులు తెస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో యువ నాయకత్వానికి పార్టీ జవసత్వాలు నింపి పట్టు సాధించే విధంగా చేయూత అందిస్తూ వారి భవిష్యత్‌కు అధిష్టానం భరోసానిస్తూ వస్తోంది. ఇప్పుడు సీనియర్లను నొప్పించకుండా జూనియర్లకు సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పించడం అధిష్టానానికి ఒక కొత్త సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాల పర్యటనలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహిస్తూ ఇరువురి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రూపులు పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను పాటించకుండా గ్రూప్ రాజకీయాలు నిర్వహిస్తున్న నేతలను తనవద్దకు పలిపించుకుని స్పెషల్‌గా క్లాస్ పీకుతున్నారు. కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని లేనిపక్షంలో మళ్లి ప్రతిపక్షంలోనే ఉంటామన్న విషయాన్ని చంద్రబాబే స్వయంగా వారికి వివరిస్తున్నారు. పనిచేస్తేనే ఎవరికైనా సముచిత స్థానం ఉంటుందని రానున్న ఎన్నికల్లో టికెట్లు కూడా వారికే దక్కుతాయని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామలన్నీ గమనించిన సీనియర్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో యువ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.