పశ్చిమబెంగాల్‌లో సాధువులపై దాడి జరిగింది. యూపీకి చెందిన ముగ్గురు సాధువులపై పురులియా జిల్లాలో కొందరు దాడికి పాల్పడ్డారు. గంగాసాగర్ మేళాకు బయల్దేరిన వారు దారి తెలియకపోవడంతో మార్గమధ్యలో పురులియా జిల్లాలో వాహనాన్ని ఆపారు.
అక్కడున్న ఇద్దరు అమ్మాయిలను దారి గురించి అడుగగా, సాధువులను చూసినా వారు భయపడి పారిపోయారు. పరిసరా ప్రాంతాల్లో ఉన్న వారు గమనించి కిడ్నాపర్లనుకొని వారిపై దాడి చేశారు. దాడిఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అందుపు చేశారు. ఆ సాధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. వారు కిడ్నాపర్లు కాదని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు సాధువులపై దాడికి పాల్పడిన 12మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన పై బీజేపీ స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ”గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారు. అధికార టీఎంసీ పార్టీ మద్దతుతో కొందరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండటం సిగ్గుచేటు” అని భాజపా దుయ్యబట్టింది.