భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘనతను సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన ఆటగాడిగానూ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతేడాది బోపన్న-ఎబ్డెన్ ద్వయం యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరి ఓటమిపాలైంది.
డబుల్స్ పార్టనర్ మ్యాథ్యూ ఎబ్డెన్తో కలిసి సెమీస్‌లో థామస్ మాచాక్-జాంగ్ జిషెన్పై బోపన్న విజయం సాధించాడు. మూడు సెట్లలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 6-3, 3-6, 7-6(10-7) తేడాతో ఫైనల్‌కు చేరింది. తొలి సెట్లో పెద్దగా పోటీని ఎదుర్కోని ఈ ద్వయానికి తర్వాత సవాల్ ఎదురైంది. రెండో సెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పుంజుకున్న బోపన్న-ఎబ్డెన్ మ్యాచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించారు. అటు మాచాక్-జిషెన్ జోడీ కూడా పట్టువిడవలేదు. దీంతో 6-6తో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సూపర్ టై బ్రేకర్స్‌లో రోహన్ జోడీ ముందడుగు వేసి విజయం సాధించింది. దాదాపు 2 గంటల రెండు నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగడం గమనార్హం.